: డబ్బు ఎక్కడికీ పోలా... ఇక్కడ అమ్మారు, అక్కడ పెట్టారు... అంతే!
నిన్నటి స్టాక్ మార్కెట్ సెషన్ లో ప్రధాన సూచీలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ప్రయత్నించడం వల్లే సూచీలు పతనం అయ్యాయని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే మార్కెట్ గరిష్ఠ స్థాయుల వద్ద ఉన్నప్పుడు వాటాలను అమ్మిన ఇన్వెస్టర్లు ఆ డబ్బుతో కోల్ ఇండియాలో వాటాలను కొనుగోలు చేశారు. బీఎస్ఈ వెల్లడించిన గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం అవగతం అవుతోంది. మధ్యాహ్నం వరకూ కోల్ ఇండియా ఆఫర్ కు పెద్దగా స్పందన రాలేదు. ఆపై నిదానంగా పుంజుకొని మధ్యాహ్నం 3:30 గంటలకెల్లా మొత్తం వాటాలు అమ్ముడయ్యాయి. మార్కెట్లో ఇతర కంపెనీల షేర్లు విక్రయించి ప్రభుత్వ రంగ కోల్ ఇండియాలోకి పెట్టుబడులు తరలించారు. మొత్తం 10 శాతానికి సమానమైన వాటాలు విక్రయించగా, భారత మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, కేంద్ర ఖజానాకు రూ.22 వేల కోట్లకు పైగా నిధులు వచ్చి చేరాయి.