: ఐఎస్‌ఐఎస్ లో హైదరాబాద్ యువతి!
ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో హైదరాబాద్‌కు చెందిన యువతి చేరినట్లు తెలంగాణ నిఘా విభాగం గుర్తించింది. ఇరాక్ చేరుకొన్న ఆ యువతి రెండు నెలలు మాత్రమే అక్కడ ఉండి ఇటీవలే తిరిగి వచ్చినట్లు తెలియడంతో, ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ యువతి కుటుంబం పదేళ్ళ కిత్రం హైదరాబాద్ నుంచి దోహా వెళ్లి స్థిరపడినట్టు సమాచారం. దోహాలో ఉంటున్న 19 ఏళ్ళ ఆ యువతి ఐఎస్‌ఐఎస్ లో చేరి, రెండు నెలల పాటు ఇరాక్‌లో పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న ఒక మధ్య వయస్కురాలితో పరిచయం పెంచుకున్న ఈ యువతి ఐఎస్ తరఫున యుద్ధంలో పాల్గొనాలన్న ఉత్సుకతతో ఇరాక్ వెళ్లింది. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను వంటచేసి పెట్టడం వంటి పనులకే పరిమితం చేయడంతో విసుగెత్తి, తమ కుటుంబ సభ్యులను సంప్రదించింది. వారు చొరవ తీసుకొని ఇటీవల తమ కుమార్తెను తెచ్చుకొన్నారు. ఐఎస్‌ఐఎస్ పై నిఘా కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.