: కొత్త సచివాలయం కట్టకపోయినా ఎర్రగడ్డలోని ఆసుపత్రిని తరలించాల్సిందే!
ఎర్రగడ్డలోని ప్రఖ్యాత ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. అక్కడ సచివాలయం కట్టకపోయినా ఆ ఆసుపత్రిని తరలించాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆసుపత్రి కట్టినప్పుడు అదో కుగ్రామమని గుర్తు చేసిన ఆయన, అప్పట్లో అక్కడ దట్టమైన అడవి ఉండేదని తెలిపారు. నిజాం ప్రభువు తన కుమార్తెకు వ్యాధి సోకినప్పుడు ఆమెకు చికిత్స కోసం నగరానికి దూరంగా ఆసుపత్రి నిర్మించగా, ఇప్పుడది నగరం మధ్యలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా అది అక్కడే ఉండటం మంచిది కాదనీ ఆయన వివరించారు. ఆసుపత్రిని మార్చాలని నిర్ణయించాకే కొత్త సచివాలయం కోసం ఛాతీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. రాష్ట్ర సచివాలయంతో పాటు అందరు ఉన్నతాధికారుల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణం చేపడితే, ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. టీబీ శానిటోరియంలో 8 మంది రోగులు ఉండగా, 296 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. యుద్ధప్రాతిపదికన అనంతగిరిలో మరమ్మతులు పూర్తి చేసి ఆసుపత్రిని అక్కడికి మార్చిన తరువాతనే కొత్త నిర్మాణాలకు భూమి పూజ చేస్తామని తెలిపారు. "మీనింగ్ ఫుల్ హెరిటేజ్ ఈజ్ ఓకే. మైండ్లెస్, మీనింగ్లెస్ హెరిటేజ్ ఈజ్ నాట్ ఓకే" అని కేసీఆర్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.