: బీజేపీ క్షమాపణలు చెప్పాల్సిందే: కేజ్రీవాల్
తనను విమర్శిస్తూ, అన్నా హజారేను అవమానపరుస్తూ ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రచార ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కేజ్రీ కాంగ్రెస్ మద్దతు తీసుకోవడాన్ని విమర్శిస్తూ ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చింది. దాంట్లో అన్నా హజారే చిత్రాన్ని ఉపయోగించింది. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, కాంగ్రెస్ మద్దతు కోరడం ద్వారా అన్నాను చంపేశారంటూ సింబాలిక్ గా ఆ చిత్రానికి పూలమాలవేశారు. హజారే చనిపోయినట్టు చూపినందుకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి చిత్రాలకు మాత్రమే పూలదండలు వేస్తామని పేర్కొన్నారు. "1948లో ఈరోజు నాథూరాం గాడ్సే గాంధీజిని చంపాడు. ఈరోజు బీజేపీ తన ప్రకటనలో అన్నాను చంపింది. ఇందుకు బీజేపీ క్షమాపణ చెప్పవద్దా?" అని కేజ్రీ ట్వీట్ చేశారు.