: వెంకన్న భక్తులకు షాక్... లడ్డూలపై పరిమితి!
తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు షాకిచ్చారు. అధిక సంఖ్యలో లడ్డూలు కోరుకునే భక్తులకు ఒక్కొక్కరికి ఎనిమిది లడ్డూలకు మించి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక సిఫార్సులపై 10, 20 లడ్డూ పడి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అధిక లడ్డూలు కావాలనుకునేవారికి ఇక నిరాశ మిగలనుంది. ఈ నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. కాగా, సాధారణ టోకెన్లపై ప్రస్తుతం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండు లడ్డూలు, ఆపై నిల్వ లడ్డూలు అయిపోయేంత వరకూ 4 లడ్డూల చొప్పున భక్తులకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భక్తులకు లడ్డూ కవర్లు ఉచితంగా ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. కవర్ల పంపిణీ ద్వారా టీటీడీకి అదనంగా భారం పడుతున్నా, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.