: ‘తిరుపతి’పై మాట్లాడేదేమీ లేదు: టీడీపీ నేతలను కలిసేందుకు ‘చింతా’ ససేమిరా!
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఇక చర్చించాల్సింది ఏమీ లేదని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ స్పష్టం చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ ఇటీవల మరణించారు. దీంతో ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన భార్యను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపేందుకు టీడీపీ చేసిన విజ్ఞప్తికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సమ్మతించింది. ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాలని అధికార, ప్రతిపక్షాలు తీర్మానించాయి. అయితే, అసెంబ్లీలో అసలు ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్, ఉప ఎన్నికల బరిలోకి తన అభ్యర్థిని దింపింది. దీంతో చింతా మోహన్ తో చర్చించి, ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వారు కొద్దిసేపటి క్రితం తిరుపతిలోని చింతా మోహన్ ఇంటికి వెళ్లారు. ఇంటిలోనే ఉన్న చింతా మోహన్ వారితో మాట్లాడేందుకు ససేమిరా అన్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి పునరాలోచన ఏమీ లేదని ఆయన పరోక్షంగానే చెప్పేశారు. ఈ నేపథ్యంలో, తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ తప్పేలా లేదు.