: కడియం ముమ్మాటికీ బీసీనే... ఆయన తల్లిదండ్రులిద్దరూ బీసీలే: మోత్కుపల్లి
తెలంగాణ డిప్యూటీ సీఎంగా కొద్దిసేపటి క్రితం పదవీబాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరిపై టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తన ఆరోపణలను కొనసాగించారు. కడియం ఎస్సీ కాదని, ముమ్మాటికీ బీసీనేనని కొద్దిసేపటి క్రితం పునరుద్ఘాటించారు. శ్రీహరి తల్లిదండ్రులిద్దరూ బీసీలేనని, ఈ మేరకు తన వద్ద పక్కా ఆధారాలున్నాయని పేర్కొన్నారు. తనవద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని మోత్కుపల్లి చెప్పారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకుని శ్రీహరి పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. నిజనిర్ధారణ జరిగిన తర్వాత పదవి కోల్పోతే, శ్రీహరికి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. సీఎం పీఠాన్ని దళితులకు కట్టబెడతానని చెప్పిన కేసీఆర్, ఆ పదవిని తానే తీసుకుని ఇప్పటికే దళితులను మోసం చేశారన్నారు. కేసీఆర్ కేబినెట్ నుంచి శ్రీహరి తప్పుకుంటే, దళితులు లేని కేబినెట్ గా తెలంగాణ మంత్రివర్గానికి దేశంలోనే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయని ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు. దళితుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు త్వరలో తెలంగాణలో దళితుల ఆత్మగౌరవ యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.