: బీజేపీ... ఓ అమెరికన్ పార్టీ: లాలూ ప్రసాద్ యాదవ్
బీజేపీపై విమర్శలు సంధించే విషయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్టుంది. భారత్ లో జరిగిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను కూడా ఆయన ఇందుకోసం వినియోగించుకోవడం విశేషం. భారత్ లో ఒబామా పర్యటన ముగిసిన మరుక్షణమే, ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీని ఆయన ఓ అమెరికన్ పార్టీగా అభివర్ణించారు. ‘‘నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు, ఒబామాకు ఏ స్థాయిలో రాచమర్యాదలు చేసిందో చూశారుగా! బీజేపీని అమెరికాకు చెందిన పార్టీ అని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ఇదే విషయాన్ని నేను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నాను’’ అని లాలూ వ్యాఖ్యానించారు. సిరి ఫోర్ట్ పై నుంచి ఒబామా చేసిన ప్రసంగాన్ని సైతం ప్రస్తావించిన లాలూ, తనదైన రీతిలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.