: సీఐ అర్జున్ నాయక్ పై కేసు నమోదు... హత్యను ప్రమాదంగా చిత్రీకరించారని అభియోగం


పొలం వద్దకెళ్లిన క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందిందని నమ్మించే యత్నం చేశారంటూ సీఐ అర్జున్ నాయక్ పై అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో నల్లమాడ పోలీస్ స్టేషన్ లో ఆయనపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లా పీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న అర్జున్ నాయక్ మంగళవారం భార్య పద్మతో కలిసి అనంతపురం జిల్లాకు చెందిన తన స్వగ్రామంలోని పొలం వద్దకెళ్లాడు. రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉన్న వారు, రాత్రి కంది పంట వద్ద రోడ్డు పక్కగా నిద్రించారు. ఈ క్రమంలో నిన్న ఉదయానికంతా పద్మ విగత జీవిగా మారగా, అర్జున్ నాయక్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. గుర్తు తెలియని వాహనం తమపై నుంచి వెళ్లిందని, దీంతో పద్మ చనిపోయిందని అర్జున్ నాయక్ చెప్పారు. అయితే పద్మ మృతదేహంపై ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో అర్జున్ నాయక్ వ్యవహార సరళిపై ఆయన పిల్లలు, పద్మ తరఫు బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు. దీనిపై తర్జనభర్జన పడ్డ పోలీసులు ఎట్టకేలకు నేడు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News