: స్మార్ట్ సిటీలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: వెంకయ్యనాయుడు
స్మార్ట్ సిటీల ఏర్పాటుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయంలో అవాస్తవాలతో జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల్లో స్మార్ట్ సిటీల నిర్మాణం చేపట్టడం లేదన్న ఆయన ప్రస్తుతమున్న నగరాలనే స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనున్నామని స్పష్టం చేశారు. అయితే, కొన్ని పార్టీలకు చెందిన నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, స్మార్ట్ సిటీల కోసం విలువైన సాగు భూములను కేంద్రం సేకరించనుందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలతో కూడిన ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు.