: రెండుగంటల పాటు అమర్ సింగ్ ను విచారించిన సిట్
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసులో రాష్ట్రీయ లోక్ దళ్ నేత అమర్ సింగ్ ను ఢిల్లీ పోలీసుల నేతృత్వంలోని సిట్ విచారించింది. దాదాపు 20 ప్రశ్నలను విచారణ సమయంలో దర్యాప్తు అధికారులు ఆయనను అడిగారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అమర్, విచారణ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ఏ ప్రకటన చేసే అధికారం తనకు లేదన్నారు. నిజానిజాలు సిట్ తేలుస్తుందన్నారు. అయితే థరూర్, సునంద మధ్య సంబంధం గురించి సిట్ తనను అడిగినట్టు చెప్పారు. ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. తాను శశిథరూర్ ను గౌరవిస్తానని, ఆయనకు వ్యతిరేకం కాదని అన్నారు. సునుంద గురించి తనకు తెలిసిన విషయాలను ఢిల్లీ పోలీసులకు వివరించానని తెలిపారు. రెండు గంటల పాటు తనను విచారించినట్టు పేర్కొన్నారు. మొదటిసారి తనను విచారణకు పిలిచారని, తరువాత ఎన్నిసార్లు పిలిచినా వెళతానని స్పష్టం చేశారు.