: నిన్న చార్లీ హెబ్డో... రేపు దినమలర్!: తమిళ పత్రికకు బెదిరింపు లేఖ
ఫ్రాన్స్ లో చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై టెర్రరిస్టులు దాడికి పాల్పడి 14 మందిని బలిగొనడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇప్పుడు ఆ తరహాలోనే ప్రముఖ తమిళ దినపత్రిక 'దినమలర్' పైనా దాడి చేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది. దినమలర్ యాజమాన్యానికి అందిన ఆ లేఖలో "నిన్న చార్లీ హెబ్డో... రేపు దినమలర్" అని పేర్కొన్నారు. అల్ ఖైదా ప్రస్తావన కూడా లేఖలో వచ్చింది. భారత దేశ మ్యాప్ ను వేసి అందులో బెదిరింపు పదజాలాన్ని పొందుపరిచారు. కోయంబత్తూరు నుంచి లేఖ వచ్చినట్టు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోయంబత్తూరు చిరునామా సరైనదా? కాదా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ పత్రిక ప్రచురించిన కార్టూన్లలో ఏవైనా ఈ బెదిరింపు లేఖకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2008లో దినమలర్ పత్రిక మహ్మద్ ప్రవక్తపై ఓ కార్టూన్ ప్రచురించగా, దానిపై కొందరు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అప్పటి నుంచి ఆ పత్రికలో వివాదాస్పద కార్టూన్లు రాలేదు. కాగా, బెదిరింపు లేఖ నేపథ్యంలో, పత్రిక కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారు.