: ఏఆర్ ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్... కాలినడకన విజయనగరం జిల్లా కలెక్టర్ గౌరవ వందనం!


పోలీసు శాఖలోని కీలక విభాగం ఆర్మ్ డ్ రిజర్వ్ (ఏఆర్) ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్... విజయనగరం జిల్లా కలెక్టర్ ను కాలిబాట పట్టించింది. ఏటా రిపబ్లిక్ డే పరేడ్ లో భాగంగా పోలీసు వాహనంలో గౌరవ వందనం స్వీకరించాల్సిన జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్, ఈ ఏడాది కాలినడకన వందనం స్వీకరించక తప్పలేదు. దీనికి ఏఆర్ ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న కోల్డ్ వారే కారణమని తేలింది. కలెక్టర్ గౌరవ వందనం కోసం ఆర్మడ్ రిజర్వ్ విభాగం వాహనాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఆ విభాగం ఉద్దేశపూర్వకంగానే వాహనాన్ని సిద్ధం చేయలేదు. ఎందుకంటే, ఆ విభాగంలోని ముగ్గురు ఉన్నతాధికారులు 'నేను గొప్పంటే, కాదు నేనే గొప్ప' అంటూ వాదులాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో, రిపబ్లిక్ పరేడ్ కు సంబంధించిన వాహన ఏర్పాట్లు తన బాధ్యత కాదంటే, తనదీ కాదని చేతులు కట్టేసుకున్నారట. దీంతో ఎవరూ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టర్ కాలినడకననే వందనం స్వీకరించారు. వేడుకలు ముగిసిన తర్వాత కాని ఈ విషయం వెలుగుచూడకపోవడంతో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ సదరు విభేదాలపై దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News