: తిరుపతి ఉప ఎన్నికకు 48 సెట్ల నామినేషన్లు... బరిలో 32 మంది అభ్యర్థులు
తిరుపతి ఉప ఎన్నికలు ఏపీలో ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయాలకు చెల్లుచీటి ఇచ్చేశాయి. పదవిలో ఉండగా మరణిస్తే, సదరు స్థానానికి ఎన్నిక జరగకుండా బాధిత నేత కుటుంబ సభ్యులకే ఆ స్థానం దక్కేలా చర్యలు తీసుకోవాలన్న సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ తిలోదకాలివ్వగా, ఆ పార్టీ అనుసరించిన కొత్త మార్గాన్ని మరో 30 మంది ఎంచుకున్నారు. నామినేషన్ల చివరి రోజైన నిన్న మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా మొత్తం 48 నామినేషన్లు దాఖలైనట్టయింది. బరిలో 32 మంది నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకూ గడువుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి బరి నుంచి తప్పుకునేలా లేరు. దీంతో తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. దివంగత నేత వెంకటరమణ సతీమణి సహా కాంగ్రెస్ పార్టీ, లోక్ సత్తా, జన సంఘ్ పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు నామినేషన్లు వేశారు. వెంకటరమణ మరణం నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.