: రూ.10 కోసం వివాదం... ముంబైలో చికెన్ షాప్ యజమాని హత్య
కేవలం రూ.10 ల కోసం చెలరేగిన ఓ చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ముగ్గురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి దిగారు. ఈ దాడిలో స్పృహ కోల్పోయిన సదరు వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు ముగ్గురు కటకటాల వెనక్కెళ్లాల్సి వచ్చింది. ముంబై మహానగరంలో నిన్న జరిగిన ఈ ఘటనలో చికెన్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఫిరోజ్ షేక్ (35) మృతి చెందగా, కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహూలు జైలుకెళ్లారు. వడ పావ్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిందితులు ముగ్గురు, నిన్న షేక్ చికెన్ షాపులో రూ.105ల చికెన్ కొన్నారు. అయితే సదరు చికెన్ కు షేక్ రూ.115 వసూలు చేశాడు. దీంతో రూ.10 ఎక్కువ వసూలు చేశావంటూ నిందితులు షేక్ తో వాదనకు దిగారు. క్షణాల్లోనే ఈ వాగ్వాదం గొడవకు దారి తీసింది. నిందితులు షేక్ పై దాడి చేశారు. దాడిలో స్పృహ కోల్పోయిన షేక్ కుప్పకూలిపోయాడు. గొడవ నేపథ్యంలో అక్కడ గుమిగూడిన స్థానికులు చౌదరిని పట్టుకోగా, మిగిలిన ఇద్దరు పరారయ్యారు. ఇక స్పృహ కోల్పోయిన షేక్ ను ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి ఈ నెల 30 వరకు కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు చెప్పారు.