: ఆనవాయితీని కాదన్న కాంగ్రెస్... తిరుపతిలో అభ్యర్థితో నామినేషన్ దాఖలు
ఎవరైనా సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగే ఉపఎన్నికలో దివంగత నేత కుటుంబ సభ్యులు పోటీకి దిగితే కనుక, మిగతా పార్టీలు అభ్యర్థిని నిలపకపోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. తమ అభ్యర్థిని బరిలో దింపింది. కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ, అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే సుగుణమ్మ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వెంకటరమణ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని అన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ వెంకటరమణ సతీమణి సుగుణమ్మను బరిలో నిలిపింది. ఆమె ఏకగ్రీవానికి టీడీపీ నేతలు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తాము అభ్యర్థిని నిలపడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలపదని అందరూ భావించినా, అనూహ్యంగా శ్రీదేవిని రంగంలోకి దింపింది. ఆమెతో నామినేషన్ వేయించింది.