: ఇకపై తరచూ భేటీ అవుదాం: తెలుగు రాష్ట్రాల సీఎంల నిర్ణయం!
ఇకపై తరచు ముఖాముఖీగా భేటీ కావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిశ్చయించుకున్నారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన ‘ఎట్ హోం’ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ మేరకు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అంతేకాక, రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలకు తాను మధ్యవర్తిత్వం నెరపేందుకు సిద్ధమేనని గవర్నర్ కూడా వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం పలు అంశాలపై మాటల దాడికి దిగిన ఇద్దరు సీఎంలు గతంలోనూ రెండు, మూడు సార్లు భేటీ అయినా పెద్దగా ఫలితం రాలేదు. అయితే తాజాగా వారిద్దరూ తీసుకున్న నిర్ణయమైనా సత్ఫలితాలనివ్వాలని రెండు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు.