: మిషెల్ ఒబామా కన్నా ఎక్కువ డ్రస్సులు మార్చిన మోదీ!
మిషెల్ ఒబామా... అమెరికా ప్రథమ పౌరురాలు. ఏ ప్రాంతాన్ని సందర్శించినా తన దుస్తుల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తూ అందరినీ ఆకర్షిస్తుంటారు. అయితే ఇండియాలో మాత్రం ఆమె తనదైన శైలిలో డ్రస్సులు మార్చి ఆకట్టుకోలేకపోయారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రకరకాల దుస్తులు మార్చి ఈ విషయంలో మిషెల్ ను అధిగమించేశారు. నిన్న పొద్దున్నే ఒబామా దంపతులు వచ్చినప్పుడు తనకెంతో ఇష్టమైన కుర్తా పైజమా ధరించి వచ్చిన మోదీ, ఆ తరువాత రాష్ట్రపతి భవన్ వద్ద సన్నటి గీతలున్న 'బంద్ గలా' సూట్ ను ధరించి కనపడ్డారు. రాత్రి విందు సమయంలో బూడిద రంగు 'బంద్ గలా' సూట్ తో సందడి చేశారు. ఇక, మిషెల్ విషయానికి వస్తే పొద్దున్న, సాయంత్రం దాదాపు ఒకే రకమైన డ్రస్ ధరించి కనిపించింది. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఒబామా సతీమణి కంటే మోదీ ఎక్కువ డ్రస్సులు మార్చాడని ట్వీట్ల మీద ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.