: భక్తజన సంద్రం నడుమ ప్రారంభమైన ఒకరోజు బ్రహ్మోత్సవం
అఖిలాండ బ్రహ్మాండ నాయకుని ఒకరోజు బ్రహ్మోత్సవం తిరుమలలో వైభవంగా ప్రారంభమయింది. రథసప్తమి వేడుకల సందర్భంగా ఒకేరోజు ఏడు వాహనాల్లో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు అశేష భక్తకోటి తరలివచ్చింది. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో రకరకాల వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై శ్రీవారు విహరిస్తున్నారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు. గాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడి పాలు అందజేయనున్నారు. ఏకధాటిగా ఏడు వాహన సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 మధ్యలో పుష్కరిణిలో చక్రస్నానం జరగనుంది.