: చదివేది ఐఐఐటీ... తినేది నాసిరకం భోజనం!
ఉడికీ ఉడకని అన్నం మెతుకులు... రుచీపచీ లేని కూరలు... నీళ్లకన్నా పలుచగా వుండే సాంబారు... కాలీకాలని చపాతీలు... శుభ్రంగా కడగని ప్లేట్లు... నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భోజనం అగచాట్లు ఇవి. ఐఐఐటీని ఎంఎల్ఏ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనిఖీ చేయగా వెలుగులోకి వచ్చిన విషయాలివి. తమ భోజనం ఇంత దారుణంగా వున్నా మెస్ సూపర్ వైజర్ గాని, ట్రిపుల్ ఐటీ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేచోట 4 వేల మందికి భోజనం పెడుతున్నారని, మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెడితే రెండు గంటలు దాటుతోందని, అందువల్ల చాలా మంది తరగతులకు కూడా వెళ్లలేకపోతున్నారని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల ఇబ్బందులపై ఎమ్మెల్యే స్పందిస్తూ, మెస్ నిర్వహణపై ఐఐఐటీ డెరైక్టర్ హనుమంతరావును పిలిపించి, పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎలా? అని నిలదీశారు. ట్రిపుల్ ఐటీని నూజివీడుకు తీసుకొచ్చింది తానేనని, ప్రతి చిన్నదానికీ జోక్యం చేసుకోవడం ఎందుకులే అని ఊరుకుంటున్నానని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ మెస్ నిర్వాహకుడికి ఇంకొక మెస్ ను కూడా ఇవ్వడానికి సిద్ధం చేశామని, రేపటి నుంచి రెండుచోట్ల రెండు వేల మందికి చొప్పున భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని డెరైక్టర్ హనుమంతరావు తెలిపారు.