: కడియంతో రాజయ్య స్థానం భర్తీ?
తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యకు ఉద్వాసన తప్పేలా కనిపించడం లేదు. రాజయ్య వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి ఆయనను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతకే ఆ పదవి కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజయ్యకు ప్రత్యమ్నాయంగా కడియం శ్రీహరిని ఎంపిక చేసినట్టు, అతనికి పదవీ బాధ్యతలు కట్టబెట్టనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై సాధ్యాసాధ్యాలను పార్టీ సహచరులతో సీఎం నేరుగా చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడియం పదవీబాధ్యతలు స్వీకరించే వరకు తాత్కాలికంగా మంత్రి లక్ష్మారెడ్డికి అప్పగించనున్నారు. కాగా, స్వైన్ ఫ్లూ వ్యాధిపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే పార్టీ నుంచి తొలగించినట్టు చెబుతున్నప్పటికీ, పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించనున్నట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి.