: గిల్ క్రిస్ట్ కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు
ఆసీస్ మాజీ క్రికెటర్, కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ -2015లో చోటు లభించింది. గిల్ క్రిస్ట్ తో పాటు, ఆసీస్ మాజీ కెప్టెన్, సెలెక్టర్ జాక్ రైడర్ కూడా ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. దీంతో జనవరి 27న సిడ్నీలో జరగనున్న అలెన్ బోర్డర్ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో వీరిద్దరూ భాగం కానున్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరికీ అలెన్ బోర్డర్ మెడల్ ను అందజేయనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. సెలెక్షన్ కమిటీ ఛాయిస్ లో భాగంగా వీరిద్దరికీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించినట్టు కమిటీ తెలిపింది. కాగా, క్రికెటర్ల అమోఘమైన సేవలను గుర్తిస్తూ హాల్ ఆఫ్ ఫేమ్ అందజేస్తారు. ఈ సంప్రదాయం ఇంగ్లండ్ లో ప్రారంభమైంది. కాగా, క్రికెటర్లు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకోవడం గర్వంగా భావిస్తారు.