: నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న మిస్డ్ కాల్ పరిచయం!
ఫోన్ పరిచయాలు కొంప ముంచుతున్నాయి. మిస్డ్ కాల్ వ్యవహారాలు మరింత వివాదాస్పదమవుతూ కాపురాలను, జీవితాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మిస్డ్ కాల్ పరిచయం ఓ వ్యక్తిని బలిగొంది. వేమనపల్లి మండలం జక్కెనపల్లికి చెందిన అంబిలపు సనకస్ నందన్ (25) ఇంటి సమీపంలోని సమీప బంధువు లావణ్య సెల్ కు మిస్డ్ కాల్ ఇచ్చాడు. మిస్డ్ కాల్ ఎవరిదంటూ ఆరాతీసేందుకు ఆమె ఫోన్ చేయడంతో అది పరిచయంగా మారింది. అది మరింత బలంగా మారుతుండడంతో విషయం ఆమె భర్త రామకృష్ణకు తెలిసింది. దీంతో అతడిని పిలిచి పోన్ లో మీరిద్దరూ మాట్లాడుకుంటున్న విషయాలన్నీ రికార్డు చేశానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో సనకస్ నందన్ మృతదేహం గ్రామ సమీపంలోని అడవిలో లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతను హత్యకు గురయ్యాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.