: ముక్కోణపు సిరీస్ లో ఆసీస్ 'హ్యాట్రిక్'
ముక్కోణపు సిరీస్ లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుతో హోబర్ట్ లో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ ట్రై సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. ఆసీస్ ఇన్నింగ్స్ లో యువ ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ (102 నాటౌట్) మరోమారు బ్యాట్ కు పనిచెప్పాడు. స్మిత్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివర్లో మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి రాగా, స్మిత్ సింగిల్ తీసి స్టార్క్ కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. స్కోర్లు సమం కాగా, ఆ తర్వాత స్టార్క్ తీసిన సింగిల్ తో ఆసీస్ విజయం సాధించింది. కాగా, వరుస విజయాలతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్తు కోసం ఇంగ్లాండ్, టీమిండియా మధ్య పోటీ నెలకొని ఉంది. టోర్నీలో భారత్ ఇంకా గెలుపు బోణీ చేయలేదు. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ పరాజయంపాలైంది.