: రజనీకాంత్ కు 'పద్మవిభూషణ్'... 148 మంది పేర్లు సిద్ధంచేసిన కేంద్రం!
భారత ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మక 'పద్మ' అవార్డుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది. వివిధ రంగాలలో ప్రతిభను కనబరిచిన 148 మందికి అవార్డులను ప్రకటించనున్నట్టు సమాచారం. బీజేపీ నేత అద్వానీతో పాటు అమితాబ్, సూపర్ స్టార్ రజనీకాంత్, ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురు బాబా రాందేవ్ లకు పద్మవిభూషణ్ పురస్కారాలు యని తెలుస్తోంది. దిలీప్ కుమార్, ఎన్.గోపాలస్వామిలను పద్మభూషణ్ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. వీరితోపాటు పి.వి.సింధు, సర్దార్ సింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు కూడా 'పద్మ' అవార్డులను అందుకోనున్నారని తెలిసింది. వీరితో పాటు 'పద్మ' పురస్కారాలను అందుకోనున్న వారిలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్, భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దారా సింగ్, చెస్ గ్రాండ్ మాస్టర్ శశికిరణ్ కృష్ణన్, కుస్తీ వీరుడు సుషీల్ కుమార్, ఆయన కోచ్ సత్పాల్, ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగురాలు అరుణిమా సిన్హా, దివంగత నటుడు ప్రాన్, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఎన్ గోపాలస్వామి, సీనియర్ లాయర్ హరీష్ సాల్వే, హెచ్ సీఎల్ చీఫ్ శివ నాడార్, సంగీత దర్శకుడు అను మాలిక్ లు అవార్డులు అందుకోనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రయాన్ ను విజయవంతం చేసిన ఎస్.కే.శివకుమార్, తుంకూర్ సిద్ధగంగా మఠం హెడ్ శివకుమారస్వామి, జగద్గురు రామణానందాచార్య, స్వామి రమభద్రాచార్య, స్వామి సత్యమిత్రానంద గిరి తదితరులు కూడా అవార్డులను అందుకోనున్నారని సమాచారం. అవార్డుల విషయంలో కేంద్రం నేడు అధికారిక ప్రకటన వెలువరించే అవకాశాలు వున్నాయి.