: బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఇదే తరుణమంటున్న బేడీ
ఐపీఎల్ ఫిక్సింగ్, ఎన్.శ్రీనివాసన్ ప్రయోజనాల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ స్పందించారు. క్రికెట్ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడం హర్షణీయం కాదని అన్నారు. విచారించదగ్గ పరిణామం అని అభిప్రాయపడ్డారు. బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఇదే సరైన తరుణమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషించేందుకు ఏమీ లేదని, తానెంతో విచారిస్తున్నానని పేర్కొన్నారు. ఐపీఎల్ లో చోటు చేసుకున్న అవినీతికి, బీసీసీఐ బాధ్యత వహించాలని బేడీ అన్నారు. ఇదంతా క్రికెట్ కు జరిగిన నష్టమని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటికీ డబ్బే మూలమని అభిప్రాయపడ్డారు. ప్రజలు మొండిపట్టుదల ప్రదర్శిస్తూ, పదవి, అధికారం వదులుకునేందుకు సిద్ధపడడం లేదని పరోక్షంగా శ్రీనివాసన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.