: మన భద్రతా ఏర్పాట్లు అమెరికా అధికారులకు నచ్చలేదట!
భారత్ లో ఒక రకంగా ఇప్పుడు హై టెన్షన్ నెలకొని ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వస్తుండడమే అందుకు కారణం. ఆయన రాక నేపథ్యంలో అత్యున్నత స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, మనవాళ్ల భద్రత ఏర్పాట్లు అమెరికా అధికారులను సంతృప్తి పరచలేకపోతున్నాయట. అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సూచించిన భద్రత చర్యలను మనవాళ్లు అమలు చేయకపోవడమే వారి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. కాగా, ఒబామా పర్యటన కోసం వేల సంఖ్యలో భద్రత బలగాలను మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజున ఆయన తాజ్ మహల్ ను సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రత ఏర్పాట్లలో 100 మంది అమెరికా సిబ్బంది కూడా పాలుపంచుకుంటున్నారు.