: గిరిజనుల దాడి... పరుగులు పెట్టిన నల్గొండ జిల్లా ఎస్ఐ
నల్గొండ జిల్లా మేళ్లచెరువు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డిపై కొందరు గిరిజనులు ఈ మధ్యాహ్నం దాడి చేశారు. ఓ కేసు విషయమై రెండు వర్గాల వారు పోలీసు స్టేషన్ ను ఆశ్రయించగా ఎస్ఐ ఒక వర్గం వారి వద్ద డబ్బు తీసుకుని, కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తూ, పీక్లా నాయక్ తండాకు చెందిన మరో వర్గం గిరిజనులు పోలీసు స్టేషన్ ను ముట్టడించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి ధర్నాను విరమించుకోవాలని హెచ్చరించారు. ఆపై ఓ గిరిజనుడిపై చేయి చేసుకోగా, కోపోద్రిక్తులైన మిగతా గిరిజనులు తిరగబడి ఎస్‌ఐపై పిడిగుద్దులు కురిపించినట్టు తెలిసింది. గిరిజనుల నుంచి తప్పించుకున్న ఎస్‌ఐ వేగంగా పరుగెడుతూ, సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలు వెళ్తున్నట్టు తెలుస్తోంది.