: కిరణ్ బేడీకి ఆప్ నేత ప్రశంస
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని ప్రముఖ న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్ ప్రశంసించారు. అరవింద్ కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీ మంచి వ్యక్తి అని ఆయన కీర్తించారు. ఈ సందర్భంగా బేడీ సీఎం అభ్యర్థిత్వాన్ని ఆయన స్వాగతించారు."బేడీ సమర్ధవంతమైన పాలకురాలు కాగలరు. అంతేకాదు ఢిల్లీకి స్పష్టమైన, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలరు" అని భూషణ్ అభిప్రాయపడ్డారు. అయితే కిరణ్ బేడీ ఆప్ సీఎం అభ్యర్థి అయితే బాగుండేదన్నారు. సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా స్వాగతించాలని కోరారు. ఇదిలా ఉంటే, శాంతి భూషణ్ వ్యాఖ్యలపై ఆప్ మరో నేత అశోతోష్ స్పందిస్తూ, అదంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పార్టీ ఇలాంటి అభిప్రాయాన్ని ఒప్పుకోదని చెప్పారు. మరోవైపు శాంతి భూషణ్ తనకు మద్దతు తెలపడంపై బేడీ కృతజ్ఞతలు తెలిపారు.