: మరికాసేపట్లో ఐపీఎల్ కేసులో సుప్రీం తీర్పు
ఐపీఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టు తుది తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. సుమారు ఏడాది పాటు సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నేడు తుది తీర్పును వెల్లడించనుంది. 2013 జూన్ లో జరిగిన ఐపీఎల్ లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సిగ్, స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాలు దేశాన్నే కాక క్రీడా ప్రపంచాన్ని ఓ కుదిపు కుదిపేశాయి. భారీ సంఖ్యలో క్రీడాకారులు ఈ తంతులో పాలుపంచుకున్నారని, వారితో తప్పు చేయించింది ఆయా జట్ల యజమానులేనని పోలీసులు వెల్లడించడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తరువాత జరిగిన దర్యాప్తులో పలు కీలకాంశాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసన్ ను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆయన మరోసారి ఆ పదవికి పోటీ పడే అవకాశం ఉన్నదీ, లేనిదీ నేడు తేలిపోనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధినేతగా శ్రీనివాసన్ కొనసాగుతుండగా, బెట్టింగ్ కుంభకోణంలో ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ప్రధాన దోషిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.