: కర్ణాటకలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్... అప్రమత్తమైన పోలీసులు!
కర్ణాటకకు ఉగ్రవాదుల నుంచి భారీ ముప్పే పొంచి ఉందట. అంతేకాక ఆ రాష్ట్రం నుంచే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు వ్యూహాలు పన్నుతున్నారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకుంటున్న ఉగ్రవాదులు ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి సవాలే విసురుతున్నారు. ఈ మేరకు నిఘా వర్గాలు పక్కా ఆధారాలతో కర్ణాటక పోలీసులను హెచ్చరించాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మైసూరు, మంగళూరు, బెల్గావీ, హుబ్లీలను ఉగ్రవాదులు తమ స్లీపర్ సెల్స్ గా మలుచుకుంటున్నారట. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. స్లీపర్ సెల్స్ ల్లోని ఉగ్రవాదులు సాధారణ సమయాల్లో నిద్రాణంగా ఉంటున్నా, ఆయా ఉగ్రవాద సంస్థల నాయకత్వం ఆదేశాలతో ఒక్కసారిగా మూకుమ్మడి దాడులకు దిగేందుకు సిద్ధంగానే ఉన్నారట. నిఘా వర్గాల హెచ్చరికలతో రంగంలోకి దిగిన కన్నడ పోలీసులు నాలుగు నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిఘాను పెంచారు.