: కేజ్రీవాల్, కిరణ్ బేడీ మధ్య మాటల యుద్ధం


అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ప్రజల్లో ఆదరణ సంపాదించుకున్న మాజీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా గత ఎన్నికల్లో కేజ్రీవాల్ సత్తా నిరూపించుకోగా, ఆయనకు పోటీగా తాజా ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బీజేపీ కిరణ్ బేడీని నిలిపింది. దీంతో, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్గిరాజుకుంది. సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్, కిరణ్ బేడీ ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. ఢిల్లీ సమస్యలపై సమగ్ర చర్చకు రమ్మంటే బేడీ ఎందుకు స్పందించడం లేదని కేజ్రీ ప్రశ్నించారు. ఆమె ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలుసన్న ఆయన, చర్చకు కేవలం రెండు గంటలు కేటాయిస్తే సరిపోతుందని సూచించారు. దానికి సమాధానంగా కేజ్రీవాల్ దృష్టి ఎప్పుడూ చర్చలపైనే ఉంటుందని, తన దృష్టి సేవపై ఉందని కిరణ్ బేడీ దీటుగా బదులిచ్చారు. బేడీ తన పేరును ట్విట్టర్ అకౌంట్ లో బ్లాక్ చేసిందని, అన్ బ్లాక్ చేయాలని అభ్యర్థిస్తున్నానని కేజ్రీ తెలుపగా, 15 నెలల కిందటే కేజ్రీని బ్లాక్ చేశానని, తనను తాను అరాచకవాదిగా చెప్పుకున్న నాడే అతనిని తన అకౌంట్ నుంచి తొలగించానని బేడీ ప్రత్యుత్తరమిచ్చారు. ఎన్నికల ముందు బహిరంగ చర్చలో పాల్గొంటే ఓటర్లకు మన ఆశయాలు, లక్ష్యాలు తెలిపే అవకాశం ఉంటుందని కేజ్రీ చెప్పగా, చర్చకు అసెంబ్లీలో చాలా సమయం ఉంటుందని, అప్పుడు చర్చించుకోవచ్చని ఆమె మాటకు మాట బదులిచ్చారు.

  • Loading...

More Telugu News