: 13 ఏళ్లకే కంపెనీ పెట్టిన ఎన్నారై
ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ భారతదేశ ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తి చేస్తున్నారు ప్రవాస భారతీయులు. బొమ్మలతో ఆడుకునే వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ 13 ఏళ్ల ఎన్నారై శుభమ్ బెనర్జీ ప్రతిభను చాటాడు. అమెరికాలో కాలిఫోర్నియాలోని శాంటాకార్లాలో నివసిస్తున్న శుభమ్ బెనర్జీ అంధులు ఎలా చదువుతారని ఓ రోజు తండ్రిని అడిగాడు. గూగుల్ లో వెతుకు అని చెప్పడంతో బ్రెయిలీ లిపి గురించి తెలుసుకున్నాడు. అంధుల ప్రింటర్ ధర లక్ష రూపాయలని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దీంతో అందరికీ అందుబాటు ధరలో బ్రెయిలీ ప్రింటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి దగ్గర్నుంచి 35 వేల డాలర్లు తీసుకుని గత వేసవిలో కేవలం 20 వేల రూపాయలకే దొరికేలా లీగో రోబోటిక్స్ తో ఓ ప్రింటర్ తయారు చేసి కంపెనీ పెట్టాడు. దానికి బ్రయిగో ల్యాబ్స్ అని పేరు పెట్టాడు. ఇప్పుడా కంపెనీలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్ప్ పెట్టుబడి పెట్టింది. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన శుభమ్ బెనర్జీ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.