: ఇండియాలో ఐటీ ఉద్యోగుల సరాసరి వేతనం గంటకు రూ.341... అందరికన్నా అత్యధికం
ఇండియాలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు ఎవరో చెప్పగలరా? ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, కేంద్రంలో పనిచేసే అధికారులు, వివిధ బ్యాంకుల చీఫ్ లు అనుకుంటున్నారా? కాదు. భారత్ లో అత్యధిక వేతనాలు అందుకుంటోంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు. సరాసరిన ఒక్కో ఐటీ ఉద్యోగి గంటకు రూ.341.80 వేతనంగా పుచ్చుకుంటున్నారు. వీరికి 8 గంటల పని దినానికి రూ.2,300 పైనే లభిస్తోంది. ఈ విషయాన్ని మాన్ స్టర్ శాలరీ ఇండెక్స్ (ఎంఎస్ఐ) వివరించింది. నిర్మాణ రంగంలోని ఉద్యోగులకు గంటకు రూ.259, వైద్య రంగంలో రూ.215, ఉత్పత్తి రంగంలో రూ.230 సరాసరిన అందుతోంది. అందరికన్నా విద్యా రంగంలో పని చేస్తున్న వారికి తక్కువ వేతనం లభిస్తోందని, వీరికి గంటకు సరాసరిన రూ.186.50 జీతం వస్తోందని ఎంఎస్ఐ పేర్కొంది. ఈ రంగంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది పనిచేస్తున్నారని తెలిపింది. ఉద్యోగాల్లో లింగ వివక్ష వుందని, పురుషులతో పోలిస్తే మహిళలు సరాసరిన 34 శాతం తక్కువ వేతనం తీసుకుంటున్నారని ఎంఎస్ఐ మానేజింగ్ డైరెక్టర్ సంజయ్ మోడీ తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొని వుందని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతదేశం కొత్తతరం అభివృద్ధి దిశగా సాగుతోందని, సమీప భవిష్యత్తులో లక్షల మందికి ఉపాధి లభించనుందని ఆయన అంచనా వేశారు.