: మమ్మల్ని అంటారెందుకు? మీరు చేయలేదా?... కాంగ్రెస్ ను ప్రశ్నించిన బీజేపీ
వివిధ కీలక నిర్ణయాలపై పార్లమెంట్లో చర్చ లేకుండా ఆర్డినెన్స్ లు తీసుకురావడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. 8 నెలల మోదీ ప్రభుత్వం 9 ఆర్డినెన్స్ లు తెచ్చిందని కాంగ్రెస్ విమర్శిస్తుండగా, "50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 456 ఆర్డినెన్స్ లు తీసుకువచ్చారని, అంటే సరాసరిన సంవత్సరానికి 9 ఆర్డినెన్స్ లు వారు తెచ్చారని బీజేపీ గుర్తు చేసింది. మమ్మల్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ గతంలో ఏం చేసిందో ప్రజలకు తెలుసనీ ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. ఇక 1952 నుంచి 2014 వరకు చూస్తే సరాసరిన సంవత్సరానికి 11 చొప్పున 637 ఆర్డినెన్స్ లు వచ్చాయని వివరించారు. వీటిల్లో 456 ఆర్డినెన్స్ లు కాంగ్రెస్ ప్రధానులు తెచ్చారని అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రధానుల్లో నెహ్రూ 70, ఇందిరా గాంధీ 77, రాజీవ్ గాంధీ 35, పీవీ నరసింహారావు 77, మన్మోహన్ సింగ్ 61 ఆర్డినెన్స్ లు తేగా, వాజ్ పాయి 58, దేవే గౌడ, గుజ్రాల్ లు 77 ఆర్డినెన్స్ లు అమలులోకి తెచ్చినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి.