: ప్రముఖ పాత్రికేయుడు చో రామస్వామికి అస్వస్థత
ప్రముఖ తమిళ పాత్రికేయుడు చో రామస్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నటుడు, రాజకీయ నేత, న్యాయవాది, 'తుగ్లక్' పత్రిక వ్యవస్థాపకుడైన రామస్వామి వయసు 80 ఏళ్లు. 'మహ్మద్ బిన్ తుగ్లక్' అనే నాటకాన్ని తమిళనాట ప్రదర్శించడం ద్వారా పాప్యులర్ అయిన ఆయన పలు సినిమాల్లోనూ నటించారు. ఆ తరువాత 'తుగ్లక్' పేరుతో పత్రిక స్థాపించి రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. తమిళనాడు రాజకీయ ప్రముఖులందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సలహాదారుగానూ గతంలో పనిచేశారు. కాగా హీరోయిన్ రమ్యకృష్ణకు ఆయన స్వయాన మేనమామ.