: ఏదో ఫలితం ఆశించి బీజేపీలో చేరలేదు: జీవిత
కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన నటి జీవిత ఓ టీవీ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏదో ఫలితం ఆశించి బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు. తాను, తన భర్త రాజశేఖర్ బీజేపీలోకి వెళ్లింది సమాజానికి మేలు చేద్దామన్న ఉద్దేశంతోనే అని పేర్కొన్నారు. రాజకీయాలకు, పదవికి సంబంధం లేదని అన్నారు. విమర్శలను పట్టించుకోనని, విమర్శించే వాళ్లు ఎక్కడైనా ఉంటారని వ్యాఖ్యానించారు. తన వృత్తికి సంబంధించిన కొత్త బాధ్యతలు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని జీవిత చెప్పారు. కొత్త సెన్సార్ బోర్డు కార్యవర్గంపై బీజేపీ ఒత్తిళ్లు ఉండబోవని తెలిపారు. బీజేపీ అలాంటి రాజకీయాలను ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు. ఇక, పాత కార్యవర్గం రాజీనామాకు కారణమైన 'మెసెంజర్ ఆఫ్ గాడ్' (ఎంఎస్ జీ) సిినిమాను తాను చూడలేదని, త్వరలో చూస్తానని చెప్పారు. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల సమస్యలను సంబంధింత మంత్రిత్వ శాఖకు తెలిపి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.