: యాడ్ షూట్లో విషాదం... మోడల్ దుర్మరణం
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యాడ్ షూట్ చేస్తుండగా మోడల్ దుర్మరణం పాలయ్యాడు. ఫిట్ నెస్ మోడల్ గా 200కు పైగా మ్యాగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చిన జార్జ్ ప్లిట్ జూనియర్ (37) ఓ పత్రిక కోసం ఫొటోలకు పోజులిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన రైలు బలంగా ఢీకొంది. ప్లిట్ తదితరులు ఆ సమయంలో రైల్వే ట్రాక్ పై షూట్ చేస్తున్నారు. రైలు హారన్ మోగించినా, మలుపు ఉండడంతో వారు పొరబడ్డారు. రైలు మరో ట్రాక్ పై వస్తోందని భావించారు. ఆ పొరబాటే ప్లిట్ ప్రాణాలను బలిగొన్నది. ప్లిట్ బాల్టిమోర్ కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కాగా, రైలు హారన్ మోగుతున్నా ప్లిట్ పట్టాలపైనే నిలుచుని ఉండడంతో ఘటనను ఆత్మహత్యగా కొందరు అనుమానించినా, దర్యాప్తు అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు.