: ఆడపిల్లలకు పట్టుదల ఎక్కువ... భవిష్యత్తు వారిదే!: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ఆ కార్యక్రమానికి అమ్మాయిలు అధికంగా హాజరవడం చూసిన చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు పట్టుదల ఎక్కువని, వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఎవరైనా సరే ఆడపిల్లలను చూసి క్రమశిక్షణను నేర్చుకోవాలని సూచించారు. అమ్మాయిలపై తనకు అపారమైన నమ్మకం ఉందని, వారు మగపిల్లలతో సమానంగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు కూడా అభివృద్ధి చెందాలని అప్పట్లో తాను 33 శాతం రిజర్వేషన్ కల్పించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో 30గా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్యను 350కి పెంచామన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే మరిన్ని ఇంజినీరింగ్ కళాశాలలు రావాలన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలంటే ఐటీ రంగ అభివృద్ధి కూడా అవసరమేనన్నారు. ఇక, ఇష్టమున్నా లేకున్నా విభజన జరిగిపోయిందని, ఇప్పుడు అందరూ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. 2020 నాటికి ఏపీ దేశంలోని టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029 నాటికి దేశంలోనే అగ్రగామిగా ఉండాలని అభిలషించారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని అన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని సంపద మనకుందన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారత్ కే ఉందన్నది వాస్తవమన్నారు. రాష్ట్రాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. స్మార్ట్ గా పనిచేయాలంటే టెక్నాలజీ సాయం తప్పనిసరి అని తెలిపారు. ఏపీలో త్వరలో వై-ఫై సేవలు ప్రవేశపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News