: ప్లీజ్... బరి నుంచి తప్పుకోండి: పార్టీ ఢిల్లీ చీఫ్ కు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్!
గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టిన షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకోనట్లుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే దాకా అభ్యర్థుల జాబితాపై మల్లగుల్లాలు పడిన ఆ పార్టీ, జాబితా ప్రకటన తర్వాత మార్పులు, చేర్పులంటూ అభ్యర్థులను గందరగోళంలోకి నెడుతోంది. తాజాగా పార్టీ ఢిల్లీ శాఖ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీకి అధిష్ఠానం షాకిచ్చింది. ‘‘పార్టీలో మీరు మరింత గురుతర బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది. ఎన్నికల బరి నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోగలరు’’ అంటూ గాంధీ నగర్ నుంచి బరిలోకి దిగనున్న ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు నిన్న పార్టీ నేత పీసీ చాకో ప్రకటించారు. లవ్లీ స్థానంలో బరిలో నిలిచే వ్యక్తిని సోమవారం ప్రకటిస్తామని చాకో నిన్న వెల్లడించారు. గాంధీ నగర్ నుంచి అర్విందర్ సింగ్ బరిలోకి దిగుతున్నట్లు పార్టీ, తన తొలి జాబితాలోనే పేర్కొంది. అధిష్ఠానం నిర్ణయంపై లవ్లీ నేటి మధ్యాహ్నం దాకా స్పందించలేదు.