: 2020 నాటికి పాక్ చేతిలో 200 అణ్వాయుధాలు... భారత్ కు పెనుముప్పేనంటున్న అమెరికా
పొరుగు దేశం పాకిస్థాన్ తో భారత్ కు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా చెబుతోంది. ప్రస్తుతం అణ్వాయుధాల తయారీలో తలమునకలై ఉన్న పాక్, 2020 నాటికి కనీసం 200 అణ్వాయుధాలను సముపార్జించుకునే అవకాశముందని అమెరికా హెచ్చరిస్తోంది. అంతేకాక పాక్ అణ్వాయుధాల తయారీకి చైనా కూడా ఇతోధికంగా చేయూతనిస్తోందని కూడా అమెరికా బల్లగుద్ది మరీ చెబుతోంది. పాక్, చైనాల రూపంలో భారత్ కు ఇద్దరు ప్రమాదకరమైన శత్రువుల నుంచి పెను ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశంతోనైనా భవిష్యత్తులో భారత్ యుద్ధం జరపాల్సి వస్తే, అణు యుద్ధం తప్పకపోవచ్చని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.