: బీహార్ లో ప్రతీకార దాడులు... ముగ్గురి సజీవ దహనం
బీహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వర్గం మూకుమ్మడిగా జరిపిన దాడుల్లో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలోని బహిల్వారా గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బహిల్వారా పొరుగు గ్రామానికి చెందిన ఓ యువకుడు, బహిల్వారాకు చెందిన ఓ యువతి మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం ఈ ఘటనకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. యువతి వర్గం ప్రేమికుడిని హతమార్చగా, బహిల్వారాపై యువకుడి వర్గీయులు మూకుమ్మడి దాడి చేశారు. గ్రామంలోని 25 ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని బీహార్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి గుప్తేశ్వర్ పాండే చెప్పారు.