: ప్రేమికుల రోజున విరహ వేదనలో విరాట్ కోహ్లీ... వరల్డ్ కప్ కు ఒంటరిగానే భారత క్రికెటర్లు!
ప్రేమికుల రోజున టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విరహ వేదనలో కొట్టుమిట్టాడక తప్పేలా లేదు. విరాట్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులు కూడా ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14)న తమ భార్యలు, ప్రియురాళ్లకు దూరంగానే ఉండనున్నారు. ఎందుకంటే, సరిగ్గా ప్రేమికుల రోజునే 2015 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి వెళుతున్న టీమిండియా క్రికెటర్ల వెంట వారి భార్యలు, ప్రియురాళ్లకు బీసీసీఐ అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒంటరిగానే టీమిండియా జట్టు సభ్యులు ఆస్ట్రేలియా బయలుదేరనున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా సభ్యులు నెలన్నర పాటు (44) విదేశీ గడ్డపై గడపాల్సి ఉంది. ఈ విషయంపై స్పందించిన బోర్డు అధికారి ఒకరు ‘‘విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించరాదన్న సంప్రదాయం ముందు నుంచే ఉంది’’ అని వ్యాఖ్యానించారు.