: బాబూ... నాగార్జున వర్సిటీలో అడుగుపెట్టొద్దు: పదవీ గండముందని ఏపీ సీఎంకు వినతుల వెల్లువ
గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో మరికొద్దిసేపట్లో ఇండియన్ యూత్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి రావద్దంటూ ఆయనకు పార్టీ నేతల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, వర్సిటీలో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటే పదవీ గండం తప్పదట. గతంతో ఉప రాష్ట్రపతి హోదాలో వర్సిటీకి వచ్చిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, కొద్దిరోజులకే మృత్యువాత పడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కొణిజేటి రోశయ్య కూడా ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది రోజులకే సీఎం పీఠం నుంచి దిగిపోయారు. ఇక జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం పదవులు కోల్పోయారు. ఈ ఉదంతాలను గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు, వర్సిటీ కార్యక్రమానికి రావద్దంటూ చంద్రబాబుకు సూచించారట. వర్సిటీ శకునం బాగా లేకనే... మొన్నటికి మొన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని వర్సిటీలోనే ఏర్పాటు చేయాలన్న సర్కారు సంకల్పం నీరుగారిపోయిందట. అంతేకాక మొన్నటి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అక్కడే నిర్వహించాలని తలచినా, చివరి నిమిషంలో సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. మరి పార్టీ నేతల సూచనలను చంద్రబాబు పాటిస్తారో, లేదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.