: ఢిల్లీ బీజేపీలో కిరణ్ బేడీకి మరింత ప్రాధాన్యం... హర్షవర్ధన్ గదిని కేటాయించిన పార్టీ!
బీజేపీ ఢిల్లీ శాఖలో మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీకి మరింత ప్రాధాన్యం లభించింది. నాలుగు రోజుల క్రితం పార్టీలో చేరిన ఆమెకు పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గదిని కేటాయించిన పార్టీ నేతలు, ఆమె అభిరుచికి అనుగుణంగా స్వల్ప మార్పులు, చేర్పులు కూడా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్థన్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పార్టీ తాజా చర్యతో నాడు ఆయన కార్యకలాపాలు సాగించిన గదిలో అడుగుపెట్టనున్న కిరణ్ బేడీ కూడా సీఎం అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి దిగనున్నారన్న ఊహాగానాలకు మరింత బలం చేరూకుతోంది. ఇప్పటికే గదిలో కిరణ్ బేడీ ఫొటోలతో పాటు అమిత్ షా, నరేంద్ర మోదీ చిత్ర పటాలు కూడా ఏర్పాటయ్యాయి. ఇక ఈ గది విస్తీర్ణం విషయానికొస్తే, పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ గది కంటే ఈ రూం చాలా పెద్దదట.