: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన డివిల్లీర్స్ ... ముప్పైఒక్క బంతుల్లోనే సెంచరీ


దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ లో శివమెత్తిన డివిల్లీర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరే ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో సెంచరీ చేశాడు. అప్పుడు కూడా ప్రత్యర్థి జట్టు విండీసే. తాజాగా, డివిల్లీర్స్... ఆండర్సన్ కంటే 5 బంతులు తక్కువగా ఆడి సరికొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ సఫారీ బ్యాటింగ్ దిగ్గజం ధాటికి విండీస్ బౌలర్లు కకావికలం అయ్యారు. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం బౌండరీల వెల్లువలో తడిసిముద్దయింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న ఉద్దేశంతో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ టాస్ గెలిచి దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించాడు. ఇలాంటి పిచ్ లపై లక్ష్యఛేదనే సులువని కరీబియన్లు భావించినా, డివిల్లీర్స్ విధ్వంసక విన్యాసాలతో వారు బిక్కచచ్చిపోయారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు సాగిన డివిల్లీర్స్ వీరవిహారం రస్సెల్ విసిరిన ఫుల్ లెంగ్త్ బంతికి కార్టర్ కు క్యాచ్ ఇవ్వడంతో ముగిసింది. మొత్తం 44 బంతులాడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 9 ఫోర్లు, 16 సిక్సులతో 149 పరుగులు చేశాడు. డివిల్లీర్స్ కు తోడు ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (153 నాటౌట్), రూసో (128) సెంచరీలు సాధించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 439 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. కానీ, డివిల్లీర్స్ సూపర్ సెంచరీ ముందు ఆమ్లా, రూసో శతకాలు వెలవెలబోయాయి. తాజా ప్రదర్శనతో వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్లలో దక్షిణాఫ్రికా (439/2) రెండోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక (443/9) తొలిస్థానంలో ఉంది. ఇక, బ్యాటింగ్ లైనప్ లో తొలి ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News