: ఏపీలో ఇక చిట్ ఫండ్ సంస్థల పప్పులుడకవ్... చట్టాల మార్పునకు ఏపీ సర్కారు శ్రీకారం!
‘‘అతి తక్కువ కాలంలో మీ సొమ్మును రెట్టింపు చేసి ఇస్తాం. నెలవారీగా స్వల్ప మొత్తంలో వాయిదాలు చెల్లించండి... నెలలు తిరక్కుండానే లక్షల రూపాయలు తీసుకెళ్లండి’’ అంటూ జనాన్ని ఊదరగొట్టి, జనం సొమ్మతో ఉడాయిస్తున్న చిట్ ఫండ్ సంస్థల మాయలు ఇకపై ఏపీలో చెల్లవు. అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాకం నేపథ్యంలో రంగంలోకి దిగనున్న ఆర్థిక, పోలీసు శాఖలు సంయుక్తంగా మోసాలకు ముకుతాడు వేయనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ప్రభుత్వం కీలక సంస్కరణలకు తెరతీసింది. అవసరమైతే చట్టాల మార్పు, కొత్త చట్టాల రూపకల్పనకూ వెనుకాడకూడదని యనమల భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా మరింత మేర చర్చలు నిర్వహించి చిట్ ఫండ్ సంస్థల చేతివాటానికి చెక్ పెడతామని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.