: ఎన్నేళ్లకెన్నేళ్లకు... లాభాల బాటలో ఎపీ ఎస్ఆర్టీసీ!
తగ్గుతున్న డీజిల్ ధరల పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చాలా సంవత్సరాల తరువాత లాభాల బాటలోకి పయనించనుంది. నిన్నటి తగ్గింపు తరువాత ఒక్క విజయవాడ జోన్ లోనే నెలకు రూ.5.30 కోట్లు ఆదా అవుతుండగా, నెలకు నష్టం కేవలం రూ.70 లక్షలుగా వుంది. అధికారులు ఇంకాస్త కష్టపడి ఆక్యుపెన్సీ రేషియో పెంచినా లేదా మరోసారి ఇంధన ధరలు తగ్గినా ఆర్టీసీ లాభాల్లోకి వెళ్ళినట్టే. కాగా, గడిచిన ఆరు నెలల వ్యవధిలో డీజిల్ ధరలు ఎనిమిదిసార్లు తగ్గిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆర్టీసీ జోన్లలో దాదాపు ఇదే స్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ధరతో పోలిస్తే ప్రస్తుతం లీటరు డీజిల్ ధర సుమారు రూ.13 వరకు తగ్గింది. పల్లెవెలుగు బస్సులకు సగటున 50 శాతంపైన, ఎక్స్ ప్రెస్, ఏసీ, గరుడ సర్వీసులకు 65 శాతంపైగా ఆక్యుపెన్సీ రేషియో ఉంటే నష్టాలు రావు. ఆ మేరకు ప్రయాణికులతో బస్సులను నడిపి సంస్థను లాభాల పట్టాలపైకి ఎక్కించాలని అధికారులు కింది స్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు.