: సంక్రాంతి సందర్భంగా జోరుగా కోడిపందేలు... వందల కోట్లు దాటిన బెట్టింగులు!
సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. వరుసగా మూడు రోజుల పాటు కోడిపందేలు విరామం లేకుండా కొనసాగాయి. ఉభయ రాష్ట్రాల్లో సాగిన ఈ పందేల్లో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా హాజరై, కేరింతలు కొట్టారు. కోస్తాంధ్ర జిల్లాల్లో జరిగిన కోడిపందేలకు ఏకంగా ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారితో పాటు పలువురు కోడిపందేలపై తమకున్న మక్కువను ఏమాత్రం దాచుకోలేకపోయారు. ఇక ప్రముఖ జానపద గాయకుడు గోరటి వెంకన్న కూడా కోడిపందేల వద్ద ప్రత్యక్షమయ్యారు. కోడిపందేలకు పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు సమాచారం. ఇక మూడు రోజుల పాటు ఉత్సవంలా సాగిన కోడిపందేల్లో ఒక్క కోస్తాంధ్ర జిల్లాల్లోనే రూ.200 కోట్ల మేర బెట్టింగులు జరిగినట్లు తెలుస్తోంది. కోడిపందేలు జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం ఏరులై పారగా, అశ్లీల నృత్యాలు అడ్డే లేకుండా సాగాయి. పలు ప్రాంతాల్లో జరిగిన పందేల్లో చిన్నపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. పోలీసుల నిషేధాజ్ఞలు ఏ ఒక్క ప్రాంతంలోనూ అమలుకాకపోవడం గమనార్హం.