: టీఆర్ఎస్ లో చేరడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: కేసీఆర్


టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పూర్తిగా సక్సెస్ అవుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వైకాపా నేతలు కారెక్కడానికి క్యూ కడుతున్నారు. ఈ మధ్యనే టీటీడీపీ కీలక నేతలు తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు టీఆర్ఎస్ లో చేరడమే కాకుండా, ఏకంగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ లో చేరడానికి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు, ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే పార్టీలో చేరతారని చెప్పారు. కొత్తవాళ్ల చేరికతో పాత నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... కష్టపడే వారికి పదవులను కట్టబెడతామని కేసీఆర్ తెలిపారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు, పాతవారితో కలసిమెలసి పని చేయాలని సూచించారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తామని, 27న భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1లోగా సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు వరకు కరెంట్ కష్టాలు తప్పవని... ఆ తర్వాత రైతులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News